మమ్మిభాష వద్దు అమ్మభాష ముద్దు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21
మమ్మిభాష వద్దు అమ్మభాష ముద్దు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 (సందర్భంగా) ప్రతి యేటా మాతృభాషా పరిరక్షణకోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రాపంచిక భాషా సాహిత్య సాంస్కృతిక వైవిధ్యం కాపాడుకోవాలని 30వ సాధారణ సభలో 19 నవంబరు 1999 న యునెస్కో ప్రకటించింది. యునెస్కో ప్రకటన మేరకు 2౦౦౦ సంవత్సరం నుండి ప్రతియేటా ఫిబ్రవరి 21 వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునెస్కో ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించడానికి బంగ్లాదేశ్ లో మాతృభాషా పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం కారణం. 1947 లో భారత్, పాకిస్తానులు విడిపోయినప్పుడు భౌగోళిక కారణాల దృష్ట్యా పాకిస్తాన్ రెండు భాగాలుగా ఏర్పడింది. వాటిలో ఒకటి పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్ దేశం) కాగా రెండవది తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) పాకిస్తాన్ ప్రభుత్వం 1948 లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. అయితే భిన్న భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యం గల తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువమంది ప్రజలు బెంగాలీ భాష మాట్లాడేవారు. వీరు ఉర్దూతో పాటు బెంగాలీ కూడా ఆధికార భాషగా గుర్తించాలని పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసారు. దానికి ఆ ప్రభుత్వం అంగీకరించలేదు. అప్పుడు తూర్పు పాకిస్తాన్ ప్రజలు భాషా సమానత్వం కోసం ఉద్యమం చేపట్టారు. అధికారభాషగా గుర్తింపు కోసం, భాషా సమానత్వం కోసం ఉద్యమం జరగడం చరిత్రలో ఇదే ప్రథమం. పాకిస్తాన్ ప్రభుత్వం వారి డిమాండును అంగీకరించకపోగా వారిపై 144 సెక్షన్ విధించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. తూర్పు పాకిస్తాన్ లో ఢాకా విశ్వవిద్యాలయంలోని విదార్థ్యులపై అలాగే ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు చేపట్టిన సామాన్య ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 21 ఫిబ్రవరి 1952 రోజున జబ్బర్, షఫియార్, బర్కాట్ వంటి ఉద్యమకారులతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఎంతోమంది గాయపడ్డారు. మాతృభాష అస్థిత్వం కోసం జరిగిన ఈ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని, అందులో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు గుర్తుగా ఫిబ్రవరి 21 ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా యునెస్కో ప్రకటించింది. మనిషి మొదటి గురువు అమ్మ మొట్టమొదట నేర్చుకునేభాష మాతృభాష. దెబ్బ తగిటనప్పుడు అమ్మా అన్నట్టు, బాధగాని, సంతోషంగాని కలిగినప్పుడు భావోద్వేగాలు మాతృభాషలోనే వెళ్ళడిస్తాము. ఎందుకంటే అది అంతరంగంలోనుంచి సహజంగా వస్తుంది. సృజనాత్మకత మాతృభాష ద్వారానే పెంపొందుతుంది. అందుకే ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని విద్యావేత్తలు ప్రకటించారు. జీవితంలో మనుగడ కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. కాని వాటి ప్రభావం మాతృభాష మీద పడకుండా చూసుకోవాలి. మాతృభాషను, ఈ మాతృభాషలలోగల సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే ప్రతియేటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో ప్రకటించింది. ప్రాపంచిక భాషావైవిధ్యాలను కాపాడుకోవడమే లక్ష్యంగా యునెస్కో మాతృభాష పరిరక్షణకు ప్రతియేటా తన కార్యాచరణను ప్రకటిస్తూవుంది. ప్రపంచంలోని చిన్న, పెద్దభాషలన్నింటినీ పరిరక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెపుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సాహంచాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. జాతీయ అభివృద్ధి, అంతర్జాతీయ అవగాహణ, శాంతిభద్రతల పరిరక్షణకు మాతృభాషను గౌరవించాలి. పరభాష మోజులో మాతృభాషను విస్మరించకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 6500 భాషల్లో చాలాభాషలు లుప్తమయ్యే దశలో ఉన్నాయి. ఇటీవలి సర్వే ద్వారా 7 ప్రధాన భాషాకుటుంబాల్లో 230 భాషల వరకు అంతరించాయని యునెస్కో తెల్పింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా 3000 భాషలు, మనదేశంలో సుమారు 40 భాషలు రానున్న కొద్దిరోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితులున్నాయని భాషావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎవరి మాతృభాషను వారే రక్షించుకోవాలనే నినాదంతో యునెస్కో ప్రకటనమేరకు ప్రపంచ దేశాలు మాతృభాషా పరిరక్షణ కోసం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 కోట్లకు పైగా మాట్లాడే తెలుగు భాష ప్రపంచ భాషల్లో 16 వ స్థానం ఆక్రమించింది. అయినా తెలుగు భాషపై కూడా అన్యభాషల ప్రభావం తప్పటంలేదు. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సఖలించు ఆంధ్రుడా చావవెందుకురాని కాళోజీ అన్నట్లు మాతృ భాషను మరవడమంటే కన్నతల్లిని ఉన్న ఊరును మరిచినట్లే. జనాభ లెక్కల ప్రకారం కనీసం ముప్పైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే ఆ భాష ప్రమాదం అంచులలోకి నెట్టివేయబడుతున్నట్టేనని యునెస్కో హెచ్చరించింది. ఆ ప్రమాదం తెలుగు భాషకు కూడా పొంచి ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాంతీయ వృత్తులు అంతరించిన తెలుగులో ప్రాంతీయ వృత్తిపదాలెన్నో నేడు వాడుకలో లేకుంటా పోయాయి. జానపదుల వాడుకలోని పదాలెన్నోఅంతరించాయి. ఇటీవల టీవీల్లో ఆంకరింగు చేసేవాళ్ళు తెలుగు పదాలను వక్రీకరించి ఉచ్చరిస్తున్నారు. దాంతో తెలుగు భాషా స్వరూపం మారిపోతుంది. భాషావేత్తలు, భాషాభిమానులు, సాహితీకారులంతా నడుం బిగించి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాషను రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రయత్నాలు ప్రారంభిద్దాం. డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ 9154690580.