Drug Abuse Prevention_మాదక ద్రవ్యాల నివారణ డ్రగ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి (జూన్ 26 ఇంటర్నేషనల్ డే ఎగినెస్ట్ డ్రగ్ ఎబ్యూజ్ ఎండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్)
Drug Abuse Prevention_మాదక ద్రవ్యాల నివారణ డ్రగ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి (జూన్ 26 ఇంటర్నేషనల్ డే ఎగినెస్ట్ డ్రగ్ ఎబ్యూజ్ ఎండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్) మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే పదార్ధాలు. వీటినే డ్రగ్స్ అని వ్యవహరిస్తున్నారు. యువతరం దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రధానమైనది. మద్యపానం, ధూమపానం కన్నా డ్రగ్స్ వినియోగం ఎన్నో రెట్లు ప్రమాదకరమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం అనగా 185 మిలియన్ల జనాభా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఏడు ప్రధాన రకాలైన డ్రగ్స్ డిప్రెసెంట్స్, సైకెడెలిక్స్, స్టిమ్యులెంట్స్, ఎంపాథోజెన్స్, ఓపియాయిడ్స్, కానబినాయిడ్స్ మరియు డిసోసియేటివ్స్ వాడుకలో కనిపిస్తున్నాయి. వీటిలో నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. ముఖ్యమైనవి. ఇవి మనిషి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బ తీయడం ద్వారా వ్యక్తి ఆలోచన, అనుభూతి మరియు ప్రవర్తనలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. డ్రగ్స్ ను మొక్కల నుండి (గంజాయి, పొగాకు), ప్రాసెస్ చేయబడిన మొక్కల ఉత్పత్తుల నుండి(ఆల్కహాల్, హెరాయిన్) సింథటిక్ రసాయనాల నుండి (ఎక్స్టసీ, యాంఫేటమిన్లు) తయారు చేస్తారు. అక్రమ వ్యాపారులు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని సంపాదించడానికి మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అమ్ముతున్నారు. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు దీనికి బానిసలై ఏమి తెలియని మత్తులో అనేక అసాంఘిక అకృత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, వాటిని కలిగివున్నవారు ఈ చట్టం ప్రకారం కఠిన శిక్షార్హులౌతారు. మాదక ద్రవ్యాల వ్యసనపరుల్ని తిరిగి మామూలు మనుషుల్ని చేడడం చాల కష్టం. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాల్లో చేర్చడం, మానసిక వైద్యుల చేత చికిత్స చేయడం ద్వారా కొంతవరకు కాపాడవచ్చు. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని వయసుల వారు డ్రగ్స్ మహమ్మారి బారిన పడి సామాజిక అశాంతికి కారణమవుతుండటం కలవరపాటు కలిగిస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారన్న ఐక్యరాజ్యసమితి అంచనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రతీ యేటా రూ.300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోందన్న గణాంకాలు డ్రగ్స్ విస్తృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలైయ్యారని, ఏడాదికి 200 కిలోల కొకైన్ వినియోగిస్తున్నారన్న కఠోర వాస్తవాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. మన దేశంలో మాదక ద్రవ్యాల అణచివేత, కఠిన చర్యల వల్ల 2014-22 మధ్య కాలంలో 22,000 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాలకు బహుముఖ సవాలుగా మారింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని అంతర్జాతీయ సమాజ స్థాపనే లక్ష్యంగా 1987 డిసెంబరు 7న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి యేట జూన్ 26ను మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని తీర్మాణించింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు ఇతర వ్యసనాలతో బాధపడుతున్న ప్రజల జీవితాల మెరుగుదల కోసం ఈ రోజు అంకితం చేయబడింది. అప్పటినుడి ప్రపంచ వ్యాప్తంగా జూన్ 26 మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ ఎబ్యూజ్ ఎండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే గా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్న వాళ్లకు దానివల్ల కలిగే ఇబ్బందులను బోధపర్చాలి. మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడానికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి బాధితులకు తెలియజేయాలి. యువతకు మాదకద్రవ్యాల వాడకం మంచిది కాదని, అనేక వ్యసనాలకు దారితీస్తుందని తెలియజేయాలి. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పాటించడంలో భాగంగా భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. 1909లో షాంఘైలో నార్కోటిక్ డ్రగ్స్‌పై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సుతో 20వ శతాబ్దం ప్రారంభంలో మాదకద్రవ్యాల వ్యాపారం ప్రపంచ సమస్యగా గుర్తించబడింది. తరువాతి దశాబ్దాలలో, ఉత్పత్తి, అక్రమ రవాణాను నియంత్రించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మూడు (1961, 1971 మరియు 1988లో) మాదకద్రవ్యాల నియంత్రణ సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ ఔషధ నియంత్రణ ఒప్పందాల అనువర్తనాన్ని పర్యవేక్షించడంలో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC) తీర్మానం ద్వారా 1946లో నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ (CND) ఏర్పాటు చేయబడింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) ప్రపంచ మాదకద్రవ్యాల సమస్యకు చికిత్స, మద్దతు మరియు పునరావాసం ద్వారా సాక్ష్యం-ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో సభ్య దేశాలకు సహకరిస్తుంది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రపంచ మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కోవడానికి సమీకృత, సమతుల్య వ్యూహంతో కూడిన అంతర్జాతీయ సహకారంపై 2009లో కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాయి. 2016లో జరిగిన జనరల్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ లో ప్రపంచ మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించడంలో పురోగతి అంచనా వేయబడింది. మార్చి 2019లో నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ ప్రపంచ మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించడానికి, ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేలా సహాయం చేయడానికి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజాన్ని ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రకటించింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం ఫలితంగా ఏర్పడే ప్రజారోగ్యం, భద్రత, సామాజిక సమస్యలను పరిష్కరించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించండి. "సాక్ష్యం స్పష్టంగా ఉంది: నివారణలో పెట్టుబడి పెట్టండి" (ది ఎవిడెన్స్ ఈస్ క్లీయర్: ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్) నినాదంతో 2024 సంవత్సరం గ్లోబల్ డ్రగ్స్ డే ప్రచారం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా సమర్థవంతమైన మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమాల రూపకల్పన, అమలులో పాల్గొనడం, నివారణ సంఘాలను శక్తివంతం చేయడం. యువత సన్మార్గం వైపు మారడానికి జ్ఞానం, నైపుణ్యాలు మరియు వనరులను అందించడం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి సాక్ష్యం-ఆధారిత వ్యూహాలను అభివృద్ధి చేయడం. డ్రగ్స్ నిరోధక చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు, సంస్థలు మరియు సంఘాల మధ్య అంతర్జాతీయ సహకారం పెంపొందించడం. మాదకద్రవ్యాల సమస్యల పట్ల అవగాహన కోసం ప్రచారాలు, ర్యాలీలు, పోస్టర్ రూపకల్పన మరియు అనేక ఇతర కార్యక్రమాలు నిర్వహించడం. ఇంటర్నేషనల్ డ్రగ్ పాలసీ కన్సార్టియం సమన్వయంతో 2013 నుండి "మద్దతు ఇవ్వండి. శిక్షించవద్దు"(సపోర్ట్. డోన్ట్ పనిష్) అనే ప్రచారం డ్రగ్ పాలసీకి సంబంధించిన విధి విధానాల్లో భాగంగా డ్రగ్స్ వాడే వ్యక్తులపై నేరారోపణకు ముగింపు పలకాలని గ్లోబల్ డ్రగ్స్ డే కార్యాచరణగా నిర్ణయించబడింది. డోంట్ పనిష్ అనేది హాని తగ్గింపు, ప్రజారోగ్యం మరియు మానవ హక్కులకు ప్రాధాన్యతనిచ్చే ఔషధ విధానాలకు మద్దతుగా గ్లోబల్ గ్రాస్‌రూట్-కేంద్రీకృత కార్యక్రమం. ఈ నినాదంతో మిత్రదేశాల సమీకరణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ డ్రగ్స్ వాడే వ్యక్తులను ఇకపై నేరస్తులుగా పరిగణించకుండా సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఔషధ విధానం ఆరోగ్యం, శ్రేయస్సు మరియు హాని తగ్గింపుపై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా విధాన నిర్ణేతలతో సంభాషణలు జరిపి మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలలో అవగాహన పెంపొందించడం. హానిని తగ్గించడం కోసం హింసాత్మక విధానాలు అంతం చేయడానికి, అందరికీ పరిహారం అందించడానికి మాదకద్రవ్యాల విధాన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించబడింది. వైద్యులు ప్రిస్క్రైబ్ చెయ్యని డ్రగ్ ఏదైనా వాడకూడని విధంగా వాడడం, ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్ ని డోస్ కంటే ఎక్కువగా తీసుకోవడం డ్రగ్ ఎబ్యూజ్ కిందకి వస్తుంది. ఈ విధంగా వాడడం నేరమే కాకుండా దానివల్ల ఆరోగ్యం పాడౌతుంది. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆలోచనలపై నియంత్రణ లోపిస్తుంది. మూడ్ స్వింగ్స్ ఏర్పడుతాయి, బాగా నిద్ర పోవడం లేదా అసలు నిద్ర లేకపోవడం, హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, మామూలుగా చెయ్యగలిగే చిన్న చిన్న పనులు కూడా చెయ్యలేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురౌతాయి. సామాజిక అభ్యున్నతికి కీలకమైన నేటి యువత దుర్వ్యసనాలకు గురవుతూ డ్రగ్స్ కు అలవాటు పడి వాటికి బానిసలవుతున్నారు. డ్రగ్ ఎబ్యూజ్ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఈ ఔషధం వారి మెదడుపై పని చేస్తూ వారిలో భయం, ఆందోళన, అభద్రతా భావం వంటి అనేక రకాల రుగ్మతలకు దారి తీస్తుంది. ఈ వ్యసనం వ్యక్తుల్లో ఆకలిలేమి, నిద్రలేమి, మలబద్ధకం, ఆందోళన, చిరాకు మరియు మేధో పనితీరు క్రమంగా బలహీనపడటానికి కారణమవుతుంది. వ్యక్తి మెదడు, నాడీ వ్యవస్థను నిస్తేజ పరుస్తుంది. ఈ దురలవాట్లు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కుటుంబంపై ప్రతికూల ప్రభావ చూపిస్తూ చివరికి జైలుకు లేదా మరణానికి దారి తీస్తాయి. మాదకద్రవ్య వ్యసనం మొత్తం ప్రపంచంలోని యువతనే కాకుండా వివిధ వయస్సుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది సామాజికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా, మానసికంగా మరియు ఆర్థికంగా వ్యక్తి నాశనానికి సామజిక అశాంతికి, ఆందోళనకు కారణమౌతుంది. ఎవరైనా మాదకద్రవ్యాల వ్యసనంతో ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. వారికి మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమౌతాయి. డ్రగ్స్‌పై వాస్తవాలను పంచుకోండి, ప్రాణాలను కాపాడండి అనేది నేడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం. డ్రగ్స్ వ్యసనం సమస్యతో బాధ పడేవారికి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కౌన్సెలింగ్ మరియు చికిత్సను అందిస్తూ వారి ఛిద్రమైన జీవితాలను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఏటా మాదకద్రవ్య దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలతో సహకారంతో చురుకుగా పని చేస్తుంది. యువతకు, విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన ఎదురయ్యే సమస్యల గురించి ఇంట్లో, విద్యాసంస్థల్లో చర్చించాలి. కుటుంబ సభ్యులు, కౌన్సెలర్లు ప్రమాదంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. డ్రగ్స్ ఔషధ దిగుబడినిచ్చే పంటల సాగు వ్యతిరేక డ్రైవ్‌లను నిర్వహించడం ద్వారా వాటి సాగును నిషేధించాలి, వాటి ఇతర రసాయనిక ఉత్పత్తులను నియంత్రించాలి. సువిశాలమైన ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి ప్రజలందరూ తమను, తమ కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని మాదక ద్రవ్యాలకు గురికాకుండా దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అందరి భాగస్వామ్యంతో డ్రగ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవచ్చు. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలౌతుంది. దానికి ప్రతిక్షణం కొంచెం కొంచెం ప్రయత్నం అవసరం. డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, కరీంనగర్ 9154690580